
- వడ్ల కొనుగోలుకు సన్నద్ధం
- యాసంగి లక్ష్యం.. 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం
నిర్మల్, వెలుగు: యాసంగి సీజన్ వడ్ల కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ సీజన్ లో మొత్తం 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మల్‌జిల్లాలో ఈసారి రైతులు 1,17,85 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత వానాకాలం సీజన్ లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని, యాసంగి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 మద్దతు ధరగా ప్రకటించింది. గతేడాది యాసంగి సీజన్లో 1,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
సన్న, దొడ్డు రకాలు వేర్వేరుగా..
జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలుకు 308 సెంటర్లను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 24,506 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు, 1,37,908 మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. సన్న రకం ధాన్యం కోసం 119, దొడ్డు రకం ధాన్యం కోసం 189 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
40.60 లక్షల గన్నీ బ్యాగులు అవసరం
ఈసారి వడ్ల కొనుగోలుకు సంబంధించి గన్నీ బ్యాగుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 40.60 లక్షల బ్యాగులు అవసరమవుతాయని అంటున్నారు. ప్రస్తుతం 12.60 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగతావి తెప్పించేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల సేకరణ ఆలస్యమైతే వడ్ల కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.